TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకూ పోలైన 9174 ఓట్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సాధారణ పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 35 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఆ లోపే వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల నుంచి ఓట్లను ఇంటి నుంచే సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం నియమించిన సిబ్బంది ఆయా వర్గాల ఓట్లను వారి ఇళ్లకు వెళ్లి పోలింగ్ చేయిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ మొత్తం 9174 ఓట్ల పోలింగ్ జరిగినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.

 

తెలంగాణలో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించడంతో వీరంతా ముందుగానే దరఖాస్తు చేసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటివరకూ ఇలా దరఖాస్తు చేసుకున్నవారిలో 9174 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఇలా ఇంటి నుండి ఓటు వేయడానికి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు కలిపి మొత్తం 29,267 దరఖాస్తులను ఎన్నికల సంఘం ఆమోదించింది.

 

సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ఓట్ల సేకరణలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ఈసీ మొదటిసారిగా ఇంటి నుండి ఓటు సౌకర్యాన్ని కల్పించింది. నవంబర్ 21 వరకు సీనియర్ సిటిజన్ల నుండి మొత్తం 17,105 దరఖాస్తులను ఈసీ ఆమోదించింది. ఇందులో 6,226 మంది ఓటు వేశారు. దివ్యాంగుల నుంచి మొత్తం 9,964 దరఖాస్తులు ఆమోదించింది. ఇందులో 2,884 మంది ఓటేశారు. ఎన్నికల పోలింగ్ తేదీ అయిన 30వ తేదీకి మూడు రోజుల ముందు వరకూ ఈ ఇంటి నుంచి ఓట్ల సేకరణ జరుగుతుంది.