TELANGANA

తెలంగాణలో 17 స్థానాల పోలింగ్, కౌంటింగ్ ముహూర్తం ఖరారు..!!

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరనుంది. ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అందులో భాగంగా నాలుగో విడతలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో, వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది.

 

తెలంగాణలోకి 17 ఎంపీ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 27వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 13న 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నిక కోడ్ తక్షణ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో లోక్ సభ సీట్ల కోసం ఇప్పటికే పార్టీల మధ్య రాజకీయం హోరా హోరీగా మారుతోంది.

 

సీఎం రేవంత్ కు మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవటం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు తన పాలనకు రిఫరెండంగా రేవంత్ అంగీకరించారు. ఈ సమయంలో బీజేపీ సైతం తెలంగాణలోనే సీట్లను గెలుచుకోవటం సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ తమ అభ్యర్దులను ప్రకటిస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం గ్యారంటీల అమలు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో, తామే మెజార్టీ సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.