AP

జగన్ వైజాగ్ షిఫ్ట్ కావడం లేదా ? గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల వ్యూహాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో గతంలో తీసుకున్న నిర్ణయాల్ని కొందరు నేతలు సమీక్షించుకుంటున్నారు.

మరికొందరు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ కూడా గతంలో వైజాగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా ఆయన చెప్పేస్తున్నారు.

సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే నగరం నడిబొడ్డున కిడ్నాప్ చేసిన విషయాన్ని అందరూ చూశారని గంటా శ్రీనివాస్ తెలిపారు. ఆ సంఘటన చూశాక ఇక సీఎం జగన్ విశాఖపట్నానికి రాలేరన్నారు. విశాఖకు రావాలన్న తన ఆలోచనను సీఎం జగన్ మానుకుంటారని ఇవాళ అన్నారు. సీఎం జగన్ విశాఖకు వస్తే ఏ విశ్వసనీయతతో ఆయన ల్యాండ్ పూలింగ్ చేస్తారని అందరూ అడుగుతున్నారని గంటా శ్రీనివాస్ ప్రశ్నించారు.

సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నానికి షిఫ్ట్ కారని గంటా వెల్లడించారు. విశాఖకు ప్రస్తుత పరిస్దితుల్లో ప్రముఖులు గానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కానీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అందుకే సీఎం జగన్ కూడా రాబోరని తాను అంచనా వేస్తున్నట్లు గంటా చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైజాగ్ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపైనా గంటా కీలక వ్యాఖ్యలు చేశారు.

వైజాగ్ లో అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రమంతా కలకలం రేపితే.. డీజీపీ మాత్రం సిగ్గులేని మాటలు మాట్లాడారని గంటా విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని, పోలీసులు భేషుగ్గా పని చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కిడ్నాప్ ను 4 గంటల్లో చేధించామని చెప్పుకొని, నిందితులను పట్టుకున్నామని చెప్పడం విడ్డూరమని గంటా ఆక్షేపించారు.