ఏపీలో ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు మరో వారం, పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆ లోపు తమకు సీటు కేటాయించే పార్టీలోకి వెళ్లి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత తలెత్తిన పరిస్ధితుల్లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీలు ఫిరాయిస్తుండగా.. ఇప్పుడు ఓ మంత్రి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు కూడా నిరాశే ఎదురైంది. ఆలూరు నుంచి మరోసారి పోటీకి వైసీపీ టికెట్ ఇవ్వట్లేదని తేలిపోవడంతో ఆయన ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు. ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గా జయరాంకు జగన్ అవకాశం కల్పించారు. అయితే ఎంపీగా పోటీకి ఆయన సిద్ధం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి పార్టీ మార్పుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపిన గుమ్మనూరు జయరాం.. రెండు రోజుల్లో పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ను పార్టీలోకి టీడీపీ కూడా ఆహ్వనిస్తోంది. రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోవడంతో పాటు నియోజకవర్గం కూడా ఖరారు చేసుకుంటారని తెలుస్తోంది.
ఎల్లుండి వైసీపీకీ, మంత్రి పదవికి రాజీనామా చేయనున్న గుమ్మనూరు జయరాం.. ఎల్లుండి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనకు ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ చేసే చాన్స్ లభించవచ్చని సమాచారం.ఆలూరులో గుమ్మనూరు జయరాం అనుచరులు కూడా ఇప్పటికే రాజీనామాలు చేస్తున్నారు.