వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఛార్మి కౌర్ నిర్మాతగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో టబూ లేదా రవినా టాండన్, ఇద్దరిలో ఒకరు కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఎట్టకేలకు టబూ ఫిక్స్ అయింది.
ఆ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తూ, పూరి జగన్నాథ్, ఛార్మితో కలిసి టబూతో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ చెప్పిన లైన్ విని సేతుపతి బాగా ఎక్సైట్ అయ్యాడని, ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెడదామా అని ఎదురు చూస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో టబూ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ మంచి కంబ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.