National

యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా నోయిడా ప్రాంతంలో నివసిస్తున్న వారికి యోగీ సర్కార్ శుభవార్త చెప్పింది.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మూడో దశ భూసేకరణ కోసం త్వరలో సామాజిక ప్రభావ సర్వే నిర్వహించేందుకు వీలుగా యోగీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. జెవార్ లో నిర్మించబోతున్న ఈ ఎయిర్ పోర్టు కారణంగా ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోనున్నాయి.

యూపీలోని గౌతమబుద్ధనగర్ లోని జెవార్ పరిధిలో 14 గ్రామాలున్నాయి. వీటిలో 1888 హెక్టార్ల భూమిని నోయిడా అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం సేకరించేందుకు వీలుగా ప్రభుత్వం వారం క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు దీనిపై సామాజిక ప్రభావ సర్వే నిర్వహించేందుకు యోగీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది పూర్తయితే నాలుగోదశ భూసేకరణ కూడా పూర్తి చేసి ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టేందుకు వీలు కలగనుంది. ఆగస్టు 30 కల్లా ఈ భూసేకరణ పూర్తి కానుంది.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో 1365 హెక్టార్లు, రెండో దశలో 1334 హెక్టార్ల భూమిని సేకరించింది. మూడో దశలో మొత్తం 2053 హెక్టార్ల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జెవార్ లోని 1888 ఎకరాలను ముందుగా సేకరిస్తున్నారు. ఆ తర్వాత మిగతా భూసేకరణ ఉంటుంది. మూడోదశలో సేకరించిన భూమిలో ఎయిర్ పోర్టుకు సంబంధించిన మూడు రన్ వేలు నిర్మించాల్సి ఉంది.

యూపీ భూసేకరణ చట్టం 2016 ప్రకారం నోయిడా ఎయిర్ పోర్టు కోసం మూడో దశ భూసేకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపింది. ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయితే కేంద్రంతో పాటు యూపీలో బీజేపీ ప్రభుత్వాలకు రాజకీయంగా కూడా ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే జెవార్ ప్రాంతం రూపురేఖలు మారి ఇక్కడి ప్రజల జీవన స్ధితిగతుల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని యోగీ సర్కార్ చెబుతోంది.