ప్రజలు తమకు అందాల్సిన సేవల్లో అంతరాయం నెలకొన్నప్పుడు కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటి వరకు రైల్వేశాఖ సేవల్లో నెలకొన్న అంతరాయాలపై చాలా మంది కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా మరో వృద్ధుడు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ పనిచేయకపోవడంపై కన్స్యూమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ విషయంపై విచారణ జరిపిన ముంబైలోని కన్స్యూమర్ కమిషన్.. ప్రయాణికుడికి రూ.50,000 పరిహారం ఇవ్వాలని ఇండియన్ రైల్వేస్‌ను ఆదేశించింది. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు సీనియర్ సిటిజన్ కావడంతో.. ఆయన అనుభవించిన మానసిక వేదనకు రూ.35,000, పిటిషన్ దాఖలు చేయడానికి చేసిన ఖర్చులకు రూ.15,000 అందజేయాలని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ రైల్వే డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది.
కాగ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతానికి చెందిన శివశంకర్ రాంశ్రింగర్ శుక్లా 2017 జూన్‌లో అలహాబాద్ నుంచి నగరానికి తిరిగి రావడానికి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్-క్లాస్ ఏసీ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. పగటిపూట ప్రయాణంలో రైల్లో ఏసీ సిస్టమ్ పనిచేయలేదు. ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. శుక్లా, ఇతర ప్రయాణికులు రైలు బయలుదేరే సమయంలో ఏసీ సమస్య గురించి టీటీఈ కి ఫిర్యాదు చేశారు. రైలు స్టార్ట్ అయినప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుందని టీటీఈ వారికి హామీ ఇచ్చారు. అయితే ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఏసీ సిస్టమ్‌లో గ్యాస్ లీక్ అయినట్లు ప్రయాణికులకు సమాచారం అందించారు. మరమ్మతుల కోసం రెండు స్టేషన్లలో రైలు ఆగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఏసీ లేకుండానే 20 గంటల ప్రయాణించాల్సి వచ్చిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీ కంపార్ట్‌మెంట్లు మూసి ఉండడంతో పాటు వెంటిలేషన్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని శుక్లా పేర్కొన్నారు.
కాగ ముంబై చేరుకున్న తర్వాత, శుక్లా కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు. సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, భారత రైల్వే మంత్రిత్వ శాఖపై ఫిర్యాదు చేశారు. అయితే రైల్వే అధికారులు ఫస్ట్ ఏసీ, థర్డ్ ఏసీ ఛార్జీల మధ్య వ్యత్యాసం ఉందని వాదించారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా రీఫండ్ క్లెయిమ్‌లపై కన్స్యూమర్ కమిషన్‌కు ఎటువంటి అధికార పరిధి లేదని పేర్కొన్నారు. రీఫండ్ కోసం టికెట్ డిపాజిట్ రసీదు కూడా నిర్ణీత 20 గంటల్లో దాఖలు చేయలేదని వారు చెప్పారు. దీనిపై స్పందించిన సౌత్ ముంబై డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్.. ప్రయాణికులకు సేవుల సక్రమంగా అందజేయడం ఇండియన్ రైల్వే బాధ్యత అని పేర్కొంది. ప్రయాణంలో మానసికంగా, శారీరకంగా బాధపడినట్లు ప్రయాణికులు చేసిన ఫిర్యాదుతో ఏకీభవించింది. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు కచ్చితంగా పరిహారం చెల్లించాలని రైల్వే విభాగాన్ని ఆదేశించింది.