బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.తాము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేశారో 2023లో ప్రజలే తీర్పు చెబుతారని సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే మన దేశంలో మోడీ అనే మహానటుడున్నారు. ఆయన్ను పంపితే మనకు మరో ఆస్కార్ వచ్చేది. మోడీలో అద్భుతమైన మహానటుడు ఉన్నారు. 2014లో ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దేశం మొత్తం సంపద దోచి వాళ్ల దోస్తుల ఖాతాలో వేస్తున్నారు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద పడుతున్నారు. పార్టీలను చీల్చి దేశాన్ని ఆగం చేయాలని చూస్తున్నారు. ఆయనను మహానటుడు అని ఉట్టిగానే అనలేదు. ఇక ఆదాయం డబుల్ చేస్తానన్నారు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నల్లధనం తెస్తానని చెప్పారు. ఇదే అడిగితే తెల్ల మోహం వేస్తున్నారు’ అని మోడీపై సెటైర్లు వేశారు కేటీఆర్.
ఇదే సభలో కాంగ్రెస్‌పై కూడా ధ్వజమెత్తారు కేటీఆర్. ’50 ఏళ్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఇప్పుడు పాదయాత్రలు చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. నిన్న మొన్నటి దాకా మనల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లే. అసలు వారికి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్‌లు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలకు మోసపోవద్దు’ అని జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు కేటీఆర్.