Uncategorized

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు..

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. 2014 పొత్తులు ఇప్పుడు ఏపీలో రిపీట్ అవుతాయనే చర్చ జరుగుతోంది. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు సమావేశం తరువాత పొత్తు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో పొత్తుల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే సీఏఏ చట్టం అమలు పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని సంచలన ప్రకటన చేసారు.

 

కీలక వ్యాఖ్యలు : ఎకనామిక్ టైమ్స్ సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మెదీ నాయకత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ రోజుతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమయంలో సీఏఏ చట్టం అమలు కావాలంటే ఈ రోజునే బిల్లు ప్రతిపాదిస్తారా..లేక మరో ప్రత్యేక సిట్టింగ్ పైన నిర్ణయం తీసుకుంటారా అనే చర్చకు ఆస్కారం ఏర్పడింది. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏను వీడి వెళ్లటం పైనా అమిత్ షా స్పందించారు.

 

మిత్రులొస్తున్నారు : తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు నడుస్తాయన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని మాత్రం అమిత్ షా తెలిపారు. కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామన్నారు.ఆంధ్రప్రదేశ్‍లో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. ఇప్పటికే శిరోమణీ అకాలీ దళ్, రాష్ట్రీయ లోక్ దళ్ వంటి పార్టీలు తిరిగి ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయమైంది. టీడీపీ సైతం అందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీని పైన రెండు పార్టీల నుంచి అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది.

 

పొత్తు ఖాయమేనా : తాజాగా ఢిల్లీలో అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం తరువాత ఎన్డీఏలో టీడీపీ తిరిగి చేరటం పైన చర్చ మొదలైంది. టీడీపీ నేతలకు చంద్రబాబు ఎన్డీఏలో చేరక తప్పదనే సంకేతాలు ఇచ్చారు. అయితే, సీట్ల గురించి చర్చలు సాగుతున్నాయని చెబుతున్నారు. తాజాగా సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమయంలో అమిత్ షా ఏపీలో పొత్తుల పైన ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడ లేమని చెప్పటం తో కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి. అయితే, కొత్త మిత్రులు వస్తున్నారని చెప్పటం ద్వారా టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరో రెండు రోజుల్లో పొత్తుల లెక్కల పైన అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.