శ్రీమంతులు తినే బియ్యం ఇక పేదలు తింటారు: సీఎం రేవంత్..

శ్రీమంతులు తినే బియ్యం ఇక పేదలు కూడా తింటారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హుజుర్ నగర్ లో సన్న బియ్యం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

 

‘దొడ్డు బియ్యం పంపిణీలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించడం సంతోషంగా ఉంది. నల్లగొండ గడ్డపై నుంచి ఎంతో మంది ఎంపీలు గెలిచారు. ఈ ప్రాంతానికి మంచి చరిత్ర ఉంది. నల్లగొండ గడ్డ వీరుల గడ్డ.. పోరాటాలకు మారు పేరు. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధపోరాటం జరిగింది. మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ ప్రాణాలకు తెగించి పోరాడారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

‘25 లక్షల ఎకరాల భూమిని ఇందిరాగాంధీ పేదలకు పంచారు. పేదలకు తెల్ల బియ్యం తినాలనే రూపాయి 90 పైసలకే కేజీ బియ్యం ఇచ్చాం. పీడీఎస్ ను 70 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ అమలు చేసింది. రెండు రూపాయలకు కిలో బియ్యం అన్న ఎన్టీఆర్ అమలు చేశారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని ఎన్టీఆర్ కొనసాగించారు. దొడ్డు బియ్యం పేరిట ఏటా రూ.10వేల కోట్ల దోపిడి జరుగుతుంది. దొడ్డు బియ్యాన్ని ఇస్తే చాలా మంది అమ్మేస్తున్నారు. దేశంలో పేదల ఆకలి తీర్చిన తల్లి సోనియమ్మ. అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

 

గత ప్రభుత్వం నాయకులు సన్నం బియ్యం పంపిణీ గురించి కనీసం ఆలోచన చేశారా..? దొడ్డు బియ్యం ప్రజలు తింటలేరు. మిల్లర్ల మాఫియాలోకి వెళ్తుంది. గత నాయకులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని భయపెట్టారు. పేదలకు ఆహార భద్రత కోసమే ఈ స్కీం ను అమలులోకి తీసుకొస్తున్నాం. పేదల కోసమే ఆహార భద్రత చట్టాన్ని సోనియమ్మ తీసుకొచ్చారు. ఈ సన్న బియ్య పథకం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది తెలంగాణ ప్రజల అదృష్టం. చరిత్రలో ఎవరు సీఎం అయినా ఈ స్కీం కొనసాగించాల్సిందే’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

దొడ్డు బియ్యాన్ని ప్రజలు కేజీకి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వాటిని కొని రీసైక్లింగ్ చేసి మళ్లీ రూ.50లకు అమ్ముకుంటున్నారు. పేద ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని కొని మిల్లర్లు రూ.కోట్లలో దందా చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడడంతో రాష్ట్ర ప్రజలు సన్న బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం రేషన్ కార్డులపై సన్నబియ్యం పథకం అమలు చేయబోతున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.