NationalTELANGANA

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని.. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

75 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామన్నారు. నేతన్నలకు 16 వేలకుపైగా కొత్త మగ్గాలు ఇవ్వబోతున్నామని.. నేటి నుంచే తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

రూ. 40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామన్నారు కేటీఆర్. కేసీఆర్ ఎప్పుడూ టాటాలు మాత్రమే కాదు.. తాతలు మెచ్చిన కుల వృత్తులు ఉంటేనే అభివృద్ధి అంటారని చెప్పారు. చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ. 200 కోట్ల క్యాష్ క్రెడిట్ లిమిట్ అందించనున్నామని తెలిపారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ. 3వేలు ఇస్తామన్నారు. ఈ పథకం ఆగస్టు, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.

చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోడీ అని కేటీఆర్ మండిపడ్డారు. చేనేత వద్దు.. అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. కేంద్రం చేనేతకారులపై మరిన్ని భారాలు వేస్తుందన్నారు. చిన్నప్పుడు చేనేతకారుల ఇంట్లో ఉండి సీఎం కేసీఆర్ చదువుకున్నారు. చేనేత కార్మికుల గురించి సీఎం కేసీఆర్‌కు తెలిసినంత ఎవరికి తెలియదు. సీఎం కేసీఆర్ చేనేతకు చేయూత పథకం తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.

కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని.. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర తప్పకుండా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎందుకంటే తెలంగాణలో ఇంటిరీయర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు కావాలంటే మన ప్రభుత్వం ఉండాలన్నారు. నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కావాలంటే కేంద్రంలో మన పాత్ర ఉండాలన్నారు.

కేంద్రం నుంచి కూడా అదనంగా డబ్బులు తెచ్చుకోవాలి. వాళ్లు రద్దు చేసిన అన్నింటిని తిరిగి ప్రారంభించాలి. ఎవరైతే మీకు కష్టకాలంలో అండగా ఉన్నారు వారిని తప్పకుండా ఆదరించండి. తప్పకుండా భవిష్యత్‌లో ప్రభుత్వం మీకు వెన్నంటి నడుస్తుంది. రాష్ట్రంలో తిరిగి తప్పకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. అందులో తనకెలాంటి అనుమానం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.