National

ఎన్నికల బరిలో రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ సిప్లిగంజ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారా. బిగ్‌ బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది.

త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇందు కోసం ముందుగానే పార్టీతో పాటుగా నియోజకవర్గం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ పైన అధికార ప్రకటనకు రాహుల్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ మంగళహాట్ ప్రాంతానికి చెందిన రాహుల్ సిప్లిగంజ్ రాజకీయంగా వార్తల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో రాహుల్ పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు సైతం ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో ఈ సారి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగా రాహుల్ ముందుకు వస్తే గోషామహల్ నుంచి పార్టీ అభ్యర్దిగా అవకాశం కల్పించేలా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. గోషామహల్ నుంచి కాంగ్రెస్ కు రాహుల్ సరైన అభ్యర్దిగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

బిగ్ బాస్ విన్నర్ గా గుర్తింపు దక్కించుకున్న రాహుల్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అరుదైన ఖ్యాతి గడించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడంతో ఆ పాట ఆస్కార్ స్టేజి మీద పర్ఫామ్ చేసే అవకాశం రాహుల్‌కు వచ్చింది. అలా రాహుల్ పేరు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ కారణంగానే మాస్ నుంచి వచ్చి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజిని గోషామహల్ నుంచి పోటీ చేపిస్తే గట్టి పోటీని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.

గోషామహల్ నుంచి ప్రస్తుతం సిట్టిగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రాజా సింగ్ ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ పైన ఇంకా స్పష్టత రాలేదు. అదే సమయంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సీటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన అభ్యర్దిగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పోటీ పైన రాహుల్ తుది నిర్ణయ తీసుకోవాల్సి ఉంది. తన శ్రేయోభిలాషులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో, రాహుల్ ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.