National

ఇస్రో సమస్యకు.. “తమిళ మట్టి” పరిష్కారం చూపింది..

చంద్రయాన్_3 విజయవంతమైంది. అందులోని లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ తొలి చిత్రాలను భూమి పైకి చేరవేశాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆనందం మిన్నంటింది.

అయితే అవి తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేస్తాయి అనేది పక్కన పెడితే.. లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

చంద్రయాన్_3 లోని లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై కంటే ముందుగా తమిళ నాడు లోని నామక్కల్ జిల్లా మట్టిపై తొలి అడుగులు వేశాయి. ఇస్రో పరిశోధనల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, చంద్రయాన్_2 మిషన్ డైరెక్టర్ మయిల్ స్వామి అన్నాదొరై, చంద్రయాన్_3 ప్రాజెక్టు డైరెక్టర్ వీర ముత్తు వేల్ కీలక భూమిక పోషించిన తరహాలోనే తమిళనాడు మట్టి కూడా చంద్రయాన్ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా కున్నమలై గ్రామం నుంచి తవ్వి తీసిన అనార్ధోసైట్ రాక్ మోడల్ పైనే ముందుగా చంద్రయాన్ పరీక్షలను ఇస్రో నిర్వహించింది.

అంతరిక్ష రంగంలో అగ్రదేశాలతో పోటీ పడుతున్న ఇస్రో 2008లో చంద్రయాన్_1 ని ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలపై మంచుతో కూడిన నీటి ఉనికిని ఆ ప్రయోగం నిర్ధారించింది. అనంతరం వెయ్యి కోట్లతో చేపట్టిన చంద్రయాన్_2 ప్రాజెక్టులో చంద్రుడి దక్షిణ దృవం పై లాండర్, రోవర్ లను సురక్షితంగా దించేందుకు చంద్రుడి ఉపరితలాన్ని పోలిన మట్టి అవసరమని ఇస్రో భావించింది. దీనికోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నుంచి కిలో 15000 చొప్పున మట్టిని కొనుగోలు చేసి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది తలకు మించిన భారం కావడంతో అలాంటి మట్టి మనదేశంలో లభిస్తుందేమోనని ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేషణ చేపట్టారు. అలాంటి లక్షణాలు ఉన్న మట్టి తమిళనాడులోని నామక్కల్ జిల్లా కున్న మలై, సిద్ధం పూడి గ్రామాల్లో ఉన్నట్టు గుర్తించారు. సేలం పెరియర్ విశ్వవిద్యాలయ భౌగోళిక శాస్త్ర అధ్యాపకుల సహకారంతో ఆ ప్రాంతంలోని మట్టిని సేకరించి పరిశోధించారు. ఆ మట్టి చంద్రుడిపై ఉన్న మట్టి అనార్థోసైట్ రాక్ లాగా ఉన్నట్టు తేలడంతో దానిని 50 టన్నుల మేరకు ఇస్రోకు తరలించారు. ఆ మట్టి నమూనాలతో ప్రత్యేక లాబరేటరీ రూపొందించి చంద్రయాన్_3 లోని లాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలపై సురక్షితంగా దిగేలా, అక్కడ అడుగులు వేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించారు. ఆదరణంగా నేల లేత ఎరుపు రంగు, క్రిమన్స్ రంగులో ఉంటుంది. దీనికి భిన్నంగా సిద్ధం పూడి, కున్న మలై ప్రాంతాల్లో నేల తెల్లగా ఉంది. అందువల్లే ఈ మట్టిపై చంద్రయాన్ _2, 3 అంటూ పరిశోధనలు చేపట్టారు. దీనిపై నామక్కల్ జిల్లా ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ ప్రాంతానికి చెందిన మట్టిపై తొలి అడుగులు వేసిందని గర్వంగా చాటుతున్నారు.