ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికారం నిలబెట్టుకొనేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అటు టీడీపీ, జనసేన సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా ఏకం అవుతున్నారు. బీజేపీ పాత్ర కీలకం కానుంది. ఇదే సమయంలో కీలక నియోజకవర్గంగా ఉన్న గుడివాడలో గెలుపు వైసీపీ, టీడీపీకతి ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ తాజా సర్వే నివేదిక ఆసక్తి కర ఫలితాలను వెల్లడించింది.
కీలకంగా గుడివాడ : గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఇక్కడ నుంచి 2004 నుంచి మాజీ మంత్రి కొడాలి నాని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2004,2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. 2019 లో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు.
కొడాలి నాని వరుసగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న ఆరోపణలపైన ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఎలాగైనా గుడివాడలో గెలవాలనే పట్టుదలతో ఉంది. కొడాలి నానిని ఓడిస్తామంటూ ఆ పార్టీ నేతలు శపథం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు సైతం గుడివాడ నియోజకవర్గంపైన నేతలతో సమీక్ష చేసారు. గుడివాడలో గెలవాలని నిర్దేశించారు.
టీడీపీ టార్గెట్ కొడాలి నాని : వైసీపీ నుంచి మరోసారి కొడాలి నాని పోటీ చేయటం ఖాయమైంది. టీడీపీ నుంచి అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ నేత వెనిగళ్ల రాముకు సీటు ఖాయమని చెబుతున్నారు. సీటును ఆశిస్తున్న రావి వేంకటేశ్వర రావుకు ఎమ్మెల్సీ ఇచ్చేలా నిర్ణయం జరిగిందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్దం అవుతోంది.
ఇదే సమయంలో పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ గుడివాడ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంశం పైన సర్వే చేసింది. అందులో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. వైసీపీకి 54.95 శాతం, టీడీపీకి 42.09 శాతం, ఎన్డీఏకు 02.19 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని సర్వే సంస్థ అంచనా వేసింది.
ఆసక్తి కర రాజకీయం : ఈ సర్వేలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. అయితే, టీడీపీ..ఎన్డీఏ ఓటింగ్ శాతం వేర్వేరుగా సర్వే సంస్థ పేర్కొంది. జనసే, బీజేపీని ఎన్డీఏ భాగస్వాములు కావటంతో ఆ రెండు పార్టీలకు వచ్చే ఓట్లుగా నిర్దారించారు. అయితే, టీడీపీ..జనసేన కలిస్తే ఓటింగ్ శాతం ఏ మేర మార్పు వస్తుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ, గన్నవరంలో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం. ఎవరు పోటీ చేసినా వైసీపీ గెలుపు ఖాయమని కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, హోరా హోరీ పోరు ఖాయమని భావిస్తున్న సయంలో తాజాగా వెల్లడైన ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.