భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం. అయితే కొంత మంది వ్యక్తులు ఈ స్తావేజులతో అక్రమ దందా చేస్తున్నారు. పాత స్టాంప్ పేపర్లను కొత్త ధరలతో విక్రయిస్తున్నారు.
ఇటీవల ఆన్లైన్ స్టాంప్ పేపర్ల విక్రయాలపై రిజి స్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పాత స్టాంప్ పేపర్లపై భూ అక్రమాణదారులు దృష్టి పెట్టడంతో గిరాకీ పెరిగింది. అయితే.. ఇలాంటి ఓ స్టాంప్ పేపర్ల ముఠా కట్టించారు పోలీసులు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సౌత్) బృందం హుస్సేనియాలం పోలీసులతో కలిసి స్టాంప్ పేపర్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.
వారి నుంచి 186 స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, డెత్ సర్టిఫికెట్లు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ టాస్క్‌ఫోర్స్ ఏవీఆర్ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తులు చందూలాల్ బారాదరిలో నివాసం ఉంటున్న మహ్మద్ సయ్యద్ అజరుద్దీన్ (41), హుస్సేనియాలం నివాసి మహ్మద్ ఇనాయత్ అలీ (46)తో పాటు జహనుమాకు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠా వివిధ డినామినేషన్ల పాత స్టాంప్ పేపర్లను అక్రమంగా ప్రజలకు విక్రయిస్తోందని, వీటిని ఉపయోగించి ముఠాలు, ల్యాండ్ మాఫియాలు నకిలీ ఆస్తుల పత్రాలను తయారు చేసి నిజమైన ఆస్తి యజమానులకు ఆస్తిపై యాజమాన్యం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు హుస్సేనియాలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.