ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ సింగిల్ గానే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తుతో రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే భావిస్తున్నాయి. ఏపీలో తిరిగి బలం పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది.
మారుతున్న లెక్కలు : ఏపీలో పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ, జనసేన తమతో బీజేపీ కలిసి వస్తుందని ధీమాతో ఉన్నాయి. కానీ, బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన రాలేదు. అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా బీజేపీ నుంచి తుది నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీలోనే బీజేపీ పొత్తుపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీతో పొత్తు తో వెళ్లటం ద్వారా కొన్ని వర్గాల ఓటింగ్ దూరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో బీజేపీ మద్దతు లేకుండా జగన్ ను ఎదుర్కోలేమనేది పార్టీలోనే మరి కొందరి భావనగా కనిపిస్తోంది.
బీజేపీ నిర్ణయం ఏంటి : బీజేపీ ఏపీ నేతల నుంచి ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం పొత్తులపైన అభిప్రాయ సేకరణ చేసింది. నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మెజార్టీ నేతలు పొత్తుతో వెళ్దామని సూచించారు. దీంతో, పార్టీ నేతల అభిప్రాయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు సిఫార్సు చేయనున్నారు. ఈ మొత్తం నివేదికల ఆధారంగా ప్రధాని మోదీ ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే, ఎన్నికల తరువాత ఎన్డీఏలో చేరే విధంగా చంద్రబాబు తాజా ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బీజేపీ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలోపేతం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
కొత్త సమీకరణాలు : ప్రతీ గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయటమ తమ లక్ష్యమని పార్టీ జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు పేర్కొన్నారు. దీని ద్వారా పొత్తుల విషయంలో నిర్ణయం ఎలా ఉన్నా పార్టీ ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకత్వ సూచనల మేరకే తాము ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అటు జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తరువాత రాజకీయంగా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉంటాయని..ఏపీ లో పొత్తులపైన క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో, ఏపీలో టీడీపీ – బీజేపీ పొత్తు పైన సందిగ్థత కొనసాగుతోంది.