AP

ఏపీ రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ ఈసీ భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వీలుగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ భారీ ఎత్తున ఓట్లను చేర్పించే కార్యక్రమం చేపట్టాయి. ఇందులో నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈసీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా మొత్తం 5.6 లక్షల ఓట్లను తొలగించినట్లు ప్రకటించారు.

 

రాష్ట్రంలో తాజా సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రచురించిన ఈసీ.. మొత్తం 4.08 కోట్ల ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. గతేడాది అక్టోబర్ 27న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత మొత్తం 5.08 లక్షల ఓటర్లు పెరిగినట్లు సీఈవో ముకేష్ కుమార్ వెల్లడించారు. ఇందులో 5 లక్షల మంది యువ ఓటర్లే ఉన్నారన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో కొత్త ఓటర్ల నమోదు కూడా చేపట్టనున్నారు.

 

ఏపీలో 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఈసీకి ఫిర్యాదులు రాగా.. ఇందులో 5.6 లక్షల ఓట్లను తొలగించారు. మిగతా ఓట్లు కొనసాగించారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లలో తనిఖీలు చేపట్టినట్లు సీఈవో ముకేష్ మీనా తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఫామ్ 6, ఫామ్ 7లు దాఖలు చేసిన వారిపై 70 కేసులు నమోదు చేశారు. 80 ఏళ్లకు పైబడిన వారికి ఇళ్లకు వెళ్లి ఓటు నమోదు చేయిస్తామని సీఈవో తెలిపారు. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు అభ్యంతరాల పై సీఈఓ కార్యాలయం లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నారు