జాతీయ స్దాయిలో ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధుల తొలి జాబితాను దాదాపుగా సిద్దం చేసింది. త్వరలో దీన్ని విడుదల చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ తమ తొలి జాబితాలో తాము కీలకంగా భావిస్తున్న 10 రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాల్లో అభ్యర్ధుల పేర్లను విడుదల చేయబోతోంది. ఇందులో పార్టీ కీలక నేతలంతా ఉంటారని అంచనా.
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితాలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, భూపేష్ బఘేల్ సహా పలువురు సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రాహుల్ గాంధీని తిరిగి వాయనాడ్ సీటు నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అలాగే గతంలో పోటీ చేసిన అమేథీ స్ధానంలోనూ బరిలోకి దిగనున్నారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుంచి ఎన్నికల అరంగేట్రం చేయబోతున్నారు. అటు ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజ్ నంద్ గావ్ సీటు నుంచి పోటీ చేయబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో సీట్లు ఖరారు చేసిన రాష్ట్రాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఢిల్లీ, లక్ష్వద్వీప్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన రాష్ట్రాల్లోనూ పలు చోట్ల సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఢిల్లీ, కేరళలో ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన సీపీఎం, ఆప్ లతో సర్దుబాట్లు చేసుకుంటోంది. కేరళలో అయితే 16 సీట్ల వరకూ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ కు తిరిగి అక్కడే సీటు కేటాయిస్తున్నారు.