దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పర్యటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి యత్నం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ పైకి దూసుకువచ్చిన ఓ వ్యక్తి… కేజ్రీవాల్ పై తన చేతిలోని ద్రవాన్ని విసిరారు. దాంతో అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది.. వెంటనే ఆ యువకుడిని అక్కడి నుంచి లాగేశారు.
దాడికి ప్రయత్నించిన యువకుడిని పట్టుకున్న పార్టీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. అనంతరం నిందితుడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. కేజ్రివాల్ పై విసిరింది…నీరు అని కొందరు అంటుంటే, లేదా సిరా విసిరాడు అని మరికొందరు చెబుతున్నారు. ఇంతకు ముందు ఛతర్పూర్-నాంగ్లోయ్‌లో కూడా కేజ్రీవాల్ పర్యటనలో ఇటువంటి సంఘటనలే జరిగాయి.
ఈ దాడులపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తన నాయకులపై దేశవ్యాప్తంగా బీజేపీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌పై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఆయనపై బీజేపీ దాడి చేయిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.