AP

ఏపీలో జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రద్దు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టంను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యుడీషియల్ ప్రివ్యూ పారదర్శకత) చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జిగా నాడు ప్రభుత్వం నియమించింది. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పరిశీలించాలని నాడు జగన్ సర్కార్ నిర్ణయించింది.

 

అయితే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర కేబినెట్ అభిప్రాయపడింది. టెండర్ల జారీలో కేంద్ర మార్గదర్శకాలు, విజిలెన్స్ కమిషన్ నిబంధనలు పాటిస్తున్నందున ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో నోటిఫికేషన్ జారీ అయింది.