ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు నాయకులు. పలు జిల్లాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్‌బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటికెళ్తోన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజీనామాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు.
అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వైసీపీని వీడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.. భారీ షాక్ ఇచ్చారు.
ఈ మధ్యే- మాజీ అవంతి శ్రీనివాస్, భీమవరానికి చెందిన మాజీ శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు. వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రకే చెందిన మరో నాయకుడు అడారి ఆనంద్ కుమార్ అదే బాట పట్టారు.
ఇప్పుడు తాజాగా రాయలసీమలో మరో నాయకుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్.. గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఇంతియాజ్. 18 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన టీజీ భరత్ చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోన్నారు.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కారణంతో తన ఐఏఎస్ సర్వీస్‌కు స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఆయన వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తరువాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు కర్నూలు టికెట్‌ను ఇఛ్చారు జగన్.