తెలుగు చలన చిత్ర పరిశ్రమపై ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పులు చెరిగారు. తెలుగు సినిమాలతో హిందూ ధర్మ వినాశనం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఓ సినిమా పరిశ్రమకు చెందిన వాడినే అయినప్పటికీ- తప్పును తప్పుగా చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టే కాదని అన్నారు.
విజయవాడలో హైందవ శంఖారావం సభ
విజయవాడ కేసరపల్లిలో ఏర్పాటైన హైందవ శంఖారావం మహాసభలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఈ సభను నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వీహెచ్‌పీ, హిందూ ధర్మాక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.
బాయ్‌కాట్ చేయాలి..
ఈ సభను ఉద్దేశించి అనంత శ్రీరామ్ మాట్లాడారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా, అవహేళన చేసేలా, కించపరిచేలా తెలుగు సినిమాలను తీస్తోన్నారని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అత్యధిక మంది నటులు, దర్శకులను అందించిన ఉమ్మడి కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడే తాను ఈ మాటలు అంటున్నానని అన్నారు. అలాంటి సినిమాలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
పురాణాలు సైతం వక్రీకరణ..
ఎంతో ఘనకీర్తి కలిగిన మన పురాణాలు, ఇతిహాసాలను సైతం తెలుగు సినిమాలు కించపరుస్తోన్నాయని అనంత శ్రీరామ్ అన్నారు. తమ సన్నివేశాలకు తగ్గట్టుగా వాటిని మార్చుకుంటోన్నారని మండిపడ్డారు. ధర్మరాజు కంటే కర్ణుడిని గొప్పవాడిగా సినిమా రంగం చిత్రీకరించిందని విమర్శించారు.
కల్కిలో..
అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును అందుకున్న అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సును చేతబట్టిన కర్ణుడు వీరుడంటూ ఇటీవలే వచ్చిన కల్కి సినిమాలో చెప్పారని, యుద్ధంలో నెగ్గేది ధనస్సా, ధర్మమా అని మనం ప్రశ్నించుకుండా మనం ఊరుకుంటామా? అని ప్రశ్నించారు అనంత్ శ్రీరామ్.
రాముడు- లవకుశల మధ్య యుద్ధమా?
రాయి అహల్యగా మారినట్లు, శ్రీరాముడు- లవకుశ మధ్య యుద్ధం జరిగినట్లు చిత్రీకరణకు అందంగా ఉండటానికి వాల్మీకీ రాసిన రామాయణాన్ని సైతం తెలుగు చిత్ర పరిశ్రమ వక్రీకరించిందని అనంత శ్రీరామ్ అన్నారు. ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతున్నాయని, మనం ఊరుకుంటే ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయని ఆయన హెచ్చరించారు.
ఐటమ్ సాంగ్‌గా..
దమ్ మారో దమ్ పాటలో హరే కృష్ణ, హరే రామ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌గా వాడుకున్నారని అనంత శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇస్కాన్ రూపొందించుకున్న ఈ నినాదాన్ని ఎంతో కించపరిచారని, దీన్ని ఐటమ్ సాంగ్‌గా వాడుకుంటే మనం ఒప్పుకొంటామా? అని నిలదీశారు. ఛత్రపతి శివాజీ తరువాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావ్‌ను బాజారీవ్ మస్తానీగా ప్రేమపిచ్చోడిగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు.
15 ఏళ్ల కిందటే ప్రతిజ్ఞ చేశా..
తాను గతంలో రాసిన ఓ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదాన్ని తొలగించాలంటూ ఓ సంగీత దర్శకుడు ఆ పాటకు కంపోజ్ చేయనన్నాడని, అందుకే జీవితాంత ఆ సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన వాటికి పాటలు రాయనని 15 సంవత్సరాల కిందటే ప్రతిజ్ఞ చేశానని అనంత శ్రీరామ్ అన్నారు.