AP

మాకెందుకీ పదవులు, బోర్డు Vs అధికారులు మధ్య రచ్చ..

టీటీడీలో రచ్చ కొనసాగుతోంది. తిరుపతి తొక్కిసలాట ఘటన పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చర్యలు.. డిప్యూటీ సీఎం ఆగ్రహంతో పాలక మండలి అత్యవసర భేటీ అయింది. అధికారుల తీరు పైన బోర్డు సభ్యులు విరుచుకుపడ్డారు. తొక్కిసలాటకు కారణం అధికారులే అని ఫైర్ అయ్యారు. ఛైర్మన్, సభ్యులు నేరుగా అధికారుల పైనే గురి పెట్టారు. ఈవో లక్ష్యంగా సభ్యులు విమర్శలు చేసారు. దర్శన టోకెన్ల కోటా గురించి చర్చకు వచ్చింది. దీంతో, తొక్కిసలాట రచ్చ టీటీడీలో పతాక స్థాయికి చేరింది.

 

సభ్యులు Vs అధికారులు

తిరుపతి తొక్కిసలాట ఘటన పైన టీటీడీలో వివాదం కొనసాగుతోంది. అధికారులే బాధ్యులంటూ పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి..డిప్యూటీ సీఎం సీరియస్ కావటంతో బోర్డు సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. జరిగిన ఘటన పైన చర్చించారు. ముఖ్యమంత్రి సమీక్షలోనే వాగ్వాదానికి దిగిన బోర్డు ఛైర్మన్ – ఈవో మధ్య మరోసారి బోర్డు సమావేశంలోనూ డైలాగ్ వార్ కొనసాగింది. పాలక మండలి సమావేశం రచ్చగా మారింది. ఆలయ నిర్వహణ నిర్ణయాల్లో అధికారుల తీరు పైన పాలక మండలి సభ్యులు మండిపడ్డారు. అధికారుల తీరు కారణంగానే తాము తల దించుకోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. ఈవో శ్యామల రావు వ్యవహార శైలి పైన బోర్డు సభ్యులు ధ్వజమెత్తారు.

 

ఈవో పై ఆగ్రహం

బోర్డు సమావేశంలో ఛైర్మన్ నాయుడు టీటీడీ అధికారుల తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇష్టానుసారం పనిచేస్తున్నారుని.. తనకు, సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వ కుండా నిర్ణయాలు తీసుకొంటున్నారని మండిపడ్డారు. పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్‌ రెడ్డి, పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ, ఎంఎస్‌ రాజు, ఆనంద సాయి, మహేందర్‌ రెడ్డి కూడా ఈవో వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. సమావేశంలో సభ్యులు జరిగిన ఘటన గురించి చేసిన కొన్ని వ్యాఖ్యల పైన ఈవో అభ్యంతరం వ్యక్తం చేసారు. కానీ, ఈ ఘటనతో కుటుంబ సభ్యులకు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని సభ్యులు వ్యాఖ్యానించారు. మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలిచే విషయంలోనూ చర్చ వేళ కొంత వాదనలు చోటు చేసుకున్నాయి.

 

వద్దంటే తొలిగించండి

అధికారుల తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు ఎంఎస్‌ రాజు వ్యాఖ్యానించారు. పాలక మండలి సభ్యులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. తిరుమలలో గదులు అమ్ముకొనే వారిని చూసినట్లు తమతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ ఫోన్లు తీయరు..ఏ నిర్ణయాలు తీసుకున్నారో తమకు చెప్పరని ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారం మొత్తం తమ గుప్పిట్లో ఉందని ప్రదర్శించుకొనే తత్వమే వారిలో కనిపిస్తోందని మరో సభ్యుడు మండిపడ్డారు. అధికారులు పనిచేయడానికి పాలక మండలి అడ్డంగా ఉందని భావిస్తే ప్రభుత్వానికి చెప్పి తమను తొలగించినా తాము బాధపడబోమని సభ్యలు వ్యాఖ్యానించారు. దీంతో, టీటీడీలో పాలక మండలి వర్సస్ అధికారుల మధ్య తొక్కిసలాట రచ్చ కొనసాగుతూనే ఉంది.