AP

క్రికెట్ అభిమానులకు అదిరిపోయో న్యూస్.. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..

తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం.. మంచి కిక్ ఇస్తోంది. సకల వసతులతో, అన్ని హంగులతో తీర్చిదిద్దాలని భావిస్తున్న రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ – ఏసీఏ అధ్యక్షుు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. ఇప్పటికే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపిన ఆయన.. కూటమి ప్రభుత్వం అధికారం ముగిసి ఎన్నికలకు వెళ్లే లోపుగానే జాతీయ స్థాయిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని యువతకు ఆనందాన్ని కలిగిస్తోంది.

 

ఏపీ రాజధాని అమరావతిని అంచనాలకు మించి రూపొందించాలని, అక్కడ అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిర్మాణాలతో పాటు మిగతా వనరుల్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మాంచాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆ స్పోర్ట్స్ సిటీలోనే ఈ భారీ స్టేడియాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్న ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్.. ఈ స్టేడియం కోసం 60 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే.. విశాఖలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి దీటుగా తీర్చిదిద్దుతామని అంటున్నారు.

 

దేశంలో ఇప్పటి వరకూ అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. దీని సిట్టింగ్ సామర్థ్యం 1.10 లక్షలు. కాగా.. ఈ స్టేడియం కంటే పెద్దగా, సిట్టింగ్ సామర్థ్యం 1.25 లక్షలతో అమరావతిలోని స్టేడియాన్ని తీర్చిదిద్దాలన ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే స్టేడియాన్ని పరిశీలించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్).. స్టేడియంలో ప్రస్తుతానికి చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పనకు ఏసీఏ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ నుంచి సైతం ఆర్థిక సాయం కోరతామని తెలిపిన… ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బోర్డు.. స్థానికంగా బోర్డు నుంచి కొంత మేర సమీకరిస్తామని తెలిపింది.

 

అన్ని రకాల హంగులతో అమరావతిని నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. క్రీడలకు సైతం మంచి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అమరావతిలో వేగం పుంజుకున్న పనులు.. కూటమి నేతల హయాంలోనే ఓ రూపుదిద్దుకుంటాయని ప్రకటించారు. అమరావతిలో 2029 జాతీయ క్రీడలు నిర్వహించడానికి బిడ్‌ వేయనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి విశేష చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఎంపీ కేశినేని.. క్రికెట్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మూడు అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల క్రికెట్ అభిమానులకు అందుబాటులో ఉండేలా.. ఉత్తరాంధ్ర, విజయవాడ, రాయలసీలో ఈ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అవసరమైతే.. వీటిన నిర్వహణకు మిథాలీ రాజ్‌, రాబిన్‌ సింగ్‌ వంటి ప్రముఖుల్ని తీసుకు వస్తామని తెలిపారు.వారి ఆధ్వర్యంలో క్రికెట్‌ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.