TELANGANA

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించాయి. ఈ సాయంత్రం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాల ని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల కాలం తరువాత తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అవుతోంది.

 

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ సాయంత్రం ఎండీ సజ్జనార్ కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించని కారణంగా సమ్మె వైపు వెళ్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. 2021 నుంచి వేతన సవరణ, దాంతోపాటు ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం తదితర డిమాండ్లతో సజ్జనార్‌కు సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు.

 

తెలంగాణ ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. గత శుక్ర, శనివారం కార్మికు లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసులను ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా.. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకోలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు నిలదీస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో, ఆర్టీసీ యాజమాన్యం అలర్ట్ అవుతోంది. సమ్మె లేకుండా సమస్యల పరిష్కారం దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.