AP

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నారా లోకేశ్ కీలక వినతి..

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నిన్న రాత్రి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి లోకేశ్ పలు కీలక వినతులు చేశారు.

 

కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని లోకేశ్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేయబోతున్న డేటా సిటీకి సహకరించాలని కోరారు.

 

కేంద్ర మంత్రితో భేటీ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ఆర్ధిక మండళ్లు, డేటా సిటీల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇచ్చిన పలు సూచనలను సీఎం దృష్టికి తీసుకువెళతామని లోకేశ్ తెలిపారు.

 

త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ విశాఖ, తిరుపతిలలో పర్యటించి గతంలో టీడీపీ హయాంలో చేసిన పనులు స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ‌విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని, కాగ్నిజెంట్ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వస్తుందని తెలిపారు. ఏడాదిలో రాష్ట్రంలో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేసుకుంటూ వెళ్తామని లోకేశ్ వివరించారు.