గృహ హింస కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులందరినీ భాగస్వామ్యం చేయడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని ఇరికించాలనే ధోరణి పెరుగుతోందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తనకు అండగా నిలవలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారన్న కోపంతోనో ఇలాంటి కేసుల్లో వారిని కూడా ఇరికిస్తున్నారని గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
వరకట్న వేధింపుల కేసులో భర్త, ఆయన కుటుంబ సభ్యులతోపాటు అత్త చెల్లెలు, ఆమె కుమారుడిని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. అత్త చెల్లెలు, ఆమె కుమారుడిపై కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టులోని ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం.. వారు కూడా వేధింపులకు పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అత్త చెల్లెలు, ఆమె కుమారుడి (పిటిషనర్)పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ, పై వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాధితురాలి భర్తపై మాత్రం భువనగిరి ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వామ్యం చేయడం తగదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కాబట్టి ఇలాంటి కేసుల్లో ఫిర్యాదులు, అభియోగాలు కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై నిర్దిష్ఠంగా ఉంటేనే వారిపై విచారణ జరపాలని పేర్కొంది. అంతే తప్ప కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా ఇరికించడమంటే గృహ హింస చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. నిరాధార ఆరోపణలు కుటుంబ వ్యవస్థ, బంధాలు, అనుబంధాలను దెబ్బతీస్తాయని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.