AP

‘యశస్’ యుద్ధ విమానం నడిపిన రామ్మోహన్ నాయుడు..

పౌర విమానయాన మంత్రి గారికి యుద్ధ విమానంలో ప్రయాణించే అవకాశం వచ్చింది. దేశ రక్షణ, భద్రతకు.. మన రక్షణ దళాలు వినియోగించే పైటర్ జెట్ ను స్వయంగా నడిపించారు. ఆ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిక్కోలు యువకుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు తన ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. యుద్ధ విమానాన్ని నడిపించడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది అంటూ ఫోటోలూ పంచుకున్నారు. ఆయనకు ఏరో ఇండియా – 2025లో ఈ అవకాశం లభించింది.

 

బెంగళూరు వేదికగా ఏరో ఇండియా – 2025 ప్రదర్శన జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ యుద్ధ విమానాన్ని నడిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హెచ్ జేటీ-36 ‘యశస్’ అనే యుద్ధ విమానంలో ప్రయాణించారు. రక్షణ శాఖ దగ్గర విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అనేక విమానాలు సైతం ఉన్నాయి. కానీ.. రామ్మోహన్ నాయుడు మాత్రం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన స్వదేశీ విమానంలో చక్కర్లు కొట్టొచ్చారు.

 

అనంతరం సామాజిమ మాధ్యమాల్లో తన సంతోషాన్ని పంచుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన ఈ యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన అద్భుత ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

 

తనకు ఏరో ఇండియాలో యుద్ధ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. విమానయాన, రక్షణ తయారీలో భారత్ రోజురోజుకు దూసుకుపోతుందన్న కేంద్ర మంత్రి.. మన సామర్థ్యానికి ఈ యుద్ధ విమానం ఓ నిరదర్శనం అన్నారు. మన పరాక్రమానికి ఈ యుద్ధ విమానం గుర్తుగా నిలుస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో దేశం పురోగమిస్తుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు.

 

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏరో ఇండియా-2025 ఈవెంట్ ఐదు రోజులపాటు కొనసాగనుంది. దేశీయంగా యుద్ధ విమానాల తయారీలో భాగస్వామ్యం అందిస్తున్న అంతర్జాతీయ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంపై అవగాహన కల్పించేందుకు ఈ ఎయిర్‌ షో ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన సైన్యాలతో పాటు వారి యుద్ధ విమానాలు, టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు.