AP

ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న GBS కేసులు..

ఓవైపు బర్డ్‌ఫ్ల్యూ వైరస్..!! మరోవైపు GBS వ్యాధి..! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రోగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రను వణికించిన GBS.. ఇప్పుడు ఏపీలోనూ బయటపడింది. గుంటూరులో ఏడుగురికి ఈ వ్యాధి సోకింది. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ కాగా, మరో ఐదుగురికి చికిత్స కొనసాగుతోంది. కాగా గురువారం నాడు శ్రీకాకుళంలో ఓ వ్యక్తికి సోకింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

 

ఈ తరుణంలో GBS రోగులను వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు పరిశీలించారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదంటున్నారు. బాధితులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది GBS వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు.

 

జీబీఎస్ వైరస్ లక్షణాలు ఇవే..

 

కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, గొంతు నొప్పితో పాటు పొడిబారిపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వస్తున్నారని సూపరింటెండెంట్ రమణ యశస్వి పేర్కొన్నారు. చికిత్స అనంతరం వారికి ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ఇస్తున్నాం అన్నారు. అయితే ఈ వైరస్ వల్ల ఎలాంటి మరణాలు లేవని, ఇది ప్రాణాంతకం కాదని, భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక సమ్మర్ సీజన్ మొదలైంది కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. సరైన పోషకాహారం, ఫ్రూట్స్ వంటివి తినాలని, వీలైనంత వరకు ఎండలో తిరగకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే.. బర్డ్ ఫ్లూ ధాటికి ఏపీ వణికిపోతోంది. కొద్దిరోజులుగా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి విపరితంగా ఉంది. బర్డ్ ఫ్లూ వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ నుంచి 10 కిలో మీటర్ల పరిధిని సర్వెలెన్స్ జోన్ గా అధికారులు ప్రకటించారు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. మంగళవారం అనుమలంకపల్లిలో 10వేలపైగా కోళ్లు చనిపోయాయి. బుధవారం మరో 2వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లను డిస్పోజ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వాటిని పౌల్ర్టీ యాజమానులు పూడ్చి పెడుతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్స్ కి పంపారు. ఆయా ఏరియాల్లో మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్ష్యణాలను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. అయితే కోళ్లను గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం ఆందోళన కలిగిస్తుంది.

 

అయితే ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీ నుంచి తెలంగాణకు వైపు వెళ్తున్న కోళ్ల వాహనాలను తెలంగాణ అధికారులు అడ్డుకొని వాటిని వెనక్కి పంపుతున్నారు. ప్రజలు ప్యానిక్ కాకుండా చూస్తున్నారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో మినహా ఎక్కడా ఈ వైరస్‌ వ్యాప్తి చెందలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కోళ్ల ఫారంలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు, కోళ్ల పెంపకం దారులు, చికెన్ షాపుల నిర్వహకుల్లో బర్డ్ ఫ్లూ పై అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

ఈ వ్యాధి మరింత ఊపందుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు. అయితే అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం ప్రజలకు తెలిపింది. ఈ వ్యాధి మనుషుల్లో వ్యాపించే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ అంటారు. ఇది పక్షి వ్యాధి. ఇది సాధారణంగా అడవి బాతులు. ఇతర నీటి పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి అడవి పక్షుల నుండి పెంపుడు కోళ్లకు కూడా వ్యాపిస్తుంది.