మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్… అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని, కేసీఆర్ నియోజకవర్గంలో వేరే వాళ్లను పోటీ చేయించాలని అన్నారు.
2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని, ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచారని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు.
శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పారు. ప్రతివాదులుగా కేసీఆర్, కేటీఆర్ లతో పాటు స్పీకర్, స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.