విశాఖ సిటీలోని సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోక ముందే ఎనిమిది భక్తులు ఈ లోకాన్ని వదిలిపెట్టారు. భక్తులు క్యూ లైన్‌లో ఉండగా సమీపంలోకి గోడ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. బస్టాండ్ నుంచి దేవాలయానికి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ కోసం కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ క్యూలైన్ సమీపంలోవున్న సిమెంట్ గోడ కూలింది. అప్పటికే భక్తులు టికెట్ల కోసం బారులు తీశారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. చందనోత్సవం నేపథ్యంలో హోంమంత్రి అనిత విశాఖలో ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే హోంమంత్రి అనితి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకున్నారు.
మృతి చెందిన ఎనిమిది మంది మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. సింహాచలం దేవాలయం చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.
స్వామి నిజరూపాన్ని దర్శించుకోకముందే భక్తులు ఈ లోకాన్ని వదిలిపోయారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నరసింహస్వామి నిజ స్వరూపం భక్తులకు దర్శన మిస్తుంది. దీన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వర్షం వల్ల ఈ విధంగా జరిగిందన్నది అధికారులు మాట. వీవీఐపీ సేవలకే నిమగ్నమైపోయారు అధికారులు.
అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు భక్తులు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈఘటన వెనుక ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు లేకపోలేదు. వర్షం తర్వాత అధికారులు ఎందుకు జాగ్రత్తగా లేరు? క్యూలైన్ల వద్ద పోలీసులు దగ్గరుంటే ఈ ఘటన చోటు చేసుకునేది కాదని అంటున్నారు.
గోడ చుట్టూ ఫెన్సింగ్ ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని చెబుతున్నారు అధికారులు. గోడ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. కేవలం రెండు వారాల్లో ఎలా నిర్మించారని అంటున్నారు. బాధ్యుతలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం ముందురోజు భక్తులు సింహాచలం చేరుకున్నారు. విశాఖ జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కాకుండే ఒడిషా, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు అధికసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కేశ ఖండనశాల ఎదురుగా ఉన్న కళ్యాణం మైదానంలో ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. అయితే ఆ క్యూలైన్లు దాటి త్రిపురాంతక స్వామి ఆలయం వరకు చేరుకుంది.
తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొపుతారు ఆలయ ప్రధాన పూజారి. స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూపంలో స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం, టీటీడీ తరఫున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మంత్రులు.