ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిలో ఇప్పటికే కీలక ప్రాజెక్టుల్ని తెరపైకి తెస్తున్న ప్రభుత్వం.. వాటిని గ్రౌండ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టుల్నీ ప్రతిపాదిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ అమరావతి రాజధానిలో సెమీ హైస్పీడ్ సర్కులర్ రైల్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ ఓ సెమీ హై స్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలును నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా విజయవాడ నుంచి మొదలుపెట్టి నంబూరు, అమరావతి , గుంటూరు, తెనాలి మధ్య ఈ రైలును నడిపేందుకు వీలుగా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం డీపీఆర్ సిద్దం చేయాలని ప్రభుత్వం ఇవాళ మెట్రో రైల్ కార్పోరేషన్ కు ఆదేశాలు ఇచ్చింది.
ఈ ప్రాజెక్టు పరిధిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు కృష్ణా కాలువ, దుగ్గిరాల, తెనాలి, వేజెండ్ల, మంగళగిరి, సతెనపల్లి, నూజివీడు, గుడివాడ, గన్నవరం వంటి ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న మార్గంలో రైళ్ల ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. కేంద్రం కూడా దీనికి సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వడంతో త్వరలోనే డీపీఆర్ కూడా సిద్దం చేసి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.