TELANGANA

నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి..

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి​ కేటీఆర్ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్‌కు పోలిక ఏంటని ఆయన మండిపడ్డారు. ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ రీసెంట్ గా పొరుగు రాష్ట్రం ఏపీలో అధికారంలో ఉన్న కీలక నేతలను కలిశారని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించి తెలంగాణ వాటా కోసం రేవంత్ సర్కార్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ముందుకు పోనియ్యకుండా పోరాటం చేస్తుంటే.. కేటీఆర్ మాత్రం ఏపీ మంత్రి నారా లోకేష్ తో రహస్య మంతనాలు జరిపారని సామ రామ్మోహన్ నాయుడు సంచలన విషయాలు బయటపెట్టారు. మంత్రి నారా లోకేష్ ను కేటీఆర్ ఇటీవల కాలంలో ఒక్కసారి కాదని.. రెండు సార్లు కలిశారని చెప్పారు. ఈ రహస్యంగా భేటీ కావడం వెనుక మతలబు ఏంటో కేటీఆర్ చెప్పాలని ఆయన నిలదీశారు. రహస్య మంతనాలు వల్ల ఎవరికి లాభమో.. సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ విషయం వెంటనే కేటీఆర్ స్పందించాలని అని అన్నారు. నారా లోకేష్ ను కలవలేదంటే.. అప్పుడే తాను రియాక్ట్ అవుతానని చెప్పారు. తన వ్యాఖ్యాల్లో అబద్ధం ఉంటే.. అన్ని వివరాలు బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెర వెనుక తెలంగాణ రాష్ట్రానికి కుట్రలు చేస్తుంది ఎవరో జనాలకు అర్థం అవతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు కేటీఆర్ ప్రతి సవాళ్లు విసురుతున్నారని.. రాష్ట్రంలోని ప్రతి అంశంపై తాను చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. రేపు అమరవీరుల స్థూపం వద్దకు రా ఏం అంశంపైనా అయినా చర్చిద్దామని సామ రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.

రైతుల సంక్షేమం పై మాట్లాడడానికి సిగ్గు ఉండాలని.. మీ పాలనలో రైతులు చనిపోతే.. కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ప్రజా ప్రభుత్వమని.. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు అవుతున్నాయని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన నేత సీఎం రేవంత్ రెడ్డికి, కేటీఆర్ తో పోలిక ఏంటని సామ రామ్మోహన్ రెడ్డి ఫైరయ్యారు.