AP

మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి.. సీరియస్ వార్నింగ్..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సరైన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని, ముఖ్యంగా ప్రభుత్వ పాలన ప్రజలలోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినేట్ సమావేశంలో చంద్రబాబు.. మంత్రుల పట్ల ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

పనితీరుపై అసంతృప్తి

నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించినా, ఈ విషయాన్ని ప్రజలకు తగిన స్థాయిలో తెలియజేయలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మంచి నిర్ణయాలు ప్రజలకు చేరకుండా పోవడం వల్ల, ప్రజల్లో వ్యతిరేకత నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము చేసే పనులను ప్రజలు గమనించాలంటే, మీరు చురుగ్గా వ్యవహరించాలి. పని చేయడమే కాదు, పని చేస్తున్నామని చెప్పగలగాలి అంటూ మంత్రులకు చంద్రబాబు సూచించారు.

 

వైసీపీ కుట్రలపై అప్రమత్తం

ఓ మహిళా శాసనసభ్యురాలిని వైసీపీ నేతలు కించపరిస్తే ఎందుకు వెంటనే స్పందిచలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటూ మంత్రులకు సూచించారు.

 

జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

ఇండోసోల్ పరిశ్రమ భూముల విషయంలో.. రైతులను రెచ్చగొట్టేందుకు జగన్ చట్టబద్ధంగా వ్యవహరించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. భూములు వద్దంటూ రైతులను రెచ్చగొట్టింది జగనే. ఇప్పుడు మళ్లీ తానే పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ.. అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నాడు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు.

 

ప్రజల మద్దతు సాధించాలంటే సమర్థత ముఖ్యం

ప్రజల మద్దతు అనేది ప్రభుత్వ పనితీరుతో.. నేరుగా సంబంధం కలిగి ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం పాలకుల హోదాలో ఉండడం కాదు, పాలనలో నిబద్ధత చూపించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలో ఉండటమే కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో.. నిజమైన నాయకత్వం ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

ముందస్తు చర్యలు అవసరం

రాష్ట్రంలో జరిగే ప్రతీ పరిణామాన్ని సమగ్రంగా గమనిస్తూ, తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రతి మంత్రిని చంద్రబాబు కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేయగలదన్నారు. అలాగే అధికార యంత్రాంగంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండి, ప్రభుత్వ నిర్ణయాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా అమలు చేయాలని సూచించారు.