AP

చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల..

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందని వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నేతలు దాడులు చేస్తే పోలీసులే వారికి రక్షణగా నిలుస్తున్నారని దుయ్యబట్టారు.

 

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సర్పంచ్ నాగ మల్లేశ్వరరావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఆయన త్వరగా కోలుకుంటారని, మృత్యుంజయుడిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ మల్లేశ్వరరావుపై జరిగిన దాడి రాజకీయపరమైన హత్యాయత్నమని సజ్జల అన్నారు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయన్నారు. వైకాపా నేత అంబటి మురళిపై కేసు నమోదు చేశారని, దాడికి రెచ్చగొట్టేలా మాట్లాడిన ధూళిపాళ్లపై మాత్రం కేసు పెట్టలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమల్లేశ్వరరావుపై దాడి చేసిన నిందితులకు సన్మానం చేసినా చేస్తారని ఎద్దేవా చేశారు.

 

పెదకూరపాడు మాజీ ఎంపీపీని ఏడాది క్రితం దారుణంగా కొట్టారని, నెల్లూరులో ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, తాజాగా గుడివాడలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పై దాడి జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోలేదని సజ్జల పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇప్పటి వరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల మందిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

 

వైకాపాను చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పరిణామాలపై ప్రైవేటు కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు. తెదేపా నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. రాష్ట్రంలో మామిడి, పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సజ్జల అన్నారు.