25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ 25 వేల పదవుల్లో సగం మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో కవిత సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాల కోసం సబ్ కోటా ఉండాలని ఆమె కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. సర్పంచ్‌లు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు బీసీలలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో, అవకాశాలు దక్కని కులాల కోసం సబ్ కోటా ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కవిత స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని ఆమె వెల్లడించారు. ఇదివరకే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయని ఆమె తెలిపారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగులో ఉందని, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దానికి ఆమోద ముద్ర వేసి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌పై గెజిట్ విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినా, ఎవరైనా కెవియట్ దాఖలు చేయకుంటే, కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డు తగిలే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆమె అన్నారు. రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు ఫలాలు చేరాలంటే సబ్ కేటగరైజేషన్ ఒక్కటే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు.