TELANGANA

బీఆర్ఎస్ లో వార్..? ఆ పదవి నుండి కవితాను తొలగింపు..!

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) నుంచి కవితకు ఉద్వాసన పలికారు. టీజీబీకేఎస్ ఇంఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనసాగనున్నారు. మిగిలిన కార్యనిర్వాహక వర్గాన్ని త్వరలోనే నియమించనున్నట్టు తెలుస్తోంది..తెలంగాణ భవన్ లో టీజీబీకేఎస్ నేతల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ కు అనుబంధంగానే టీజీబీకేఎస్ పనిచేయాలని సమావేశంలో కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు టీజీబీకేఎస్ కు కవిత అధ్యక్షురాలిగా ఉన్నారు. కవిత, కేటీఆర్ కు మధ్య గత కొంత కాలంగా గ్యాప్ ఉన్నట్టు రాష్ట్రంలో తెగ ప్రచారం జరిగింది. కేటీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇద్దరి మధ్య గ్యాప్ నిజంగానే ఉందని ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. అయతే ఇప్పుడు పదవి నుంచి కవితను తొలగించడంతో మరింత క్లారిటీ వచ్చిందని పలువురు చెబుతున్నారు.నిజానికి తెలంగాణ జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో హడావిడి చేస్తున్నప్పటికీ ఆమె వ్యవహారాలపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదు. అయితే.. టీజీబీకేఎస్ అధ్యక్షురాలి పదవి నుంచి కవితను కేటీఆర్ తొలగించడంతో ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలకు, నాయకులకు ఓ క్లారిటీ వచ్చిందనే చెప్పవచ్చు.తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంపై టీజేబీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి బిగ్ టీవీతో మాట్లాడారు. సింగరేణి భవిష్యత్తు, సింగరేణిని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి సమావేశంలో చర్చించామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య కొప్పుల ఈశ్వర్ ను ఈ పదవిని అప్పగిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అందుకోసమే ఆయనను ఇంచార్జీగా నియమించినట్టు స్పష్టం చేశారు. ఇకనుంచి బీఆర్ఎస్ కు అనుబంధంగా టీజీబీకేఎస్ కొనసాగుతోందని చెప్పారు.అయితే కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై తన చెల్లి కవిత రియాక్ట్ అవుతారా..? లేదా..? రియాక్ట్ అయితే ఆమె స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. కవిత ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు.