ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనతో తోతాపురి మామిడి రైతుల కష్టాలపై మొదలైన చర్చకు కేంద్రం ముగింపు పలికింది. తోతాపురి రైతులకు మద్దతు ధర విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం దీనికి ఓ పరిష్కారం చూపింది. తోతాపురి మామిడి పళ్లకు మద్దతు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయాల సంగతి ఎలా ఉన్నా రైతులకు మాత్రం ఊరట లభించనుంది.
ఈ ఏడాది తోతాపురి మామిడికి అత్యధిక దిగుబడి రావడంతో ధర తగ్గుముఖం పట్టింది. దీంతో రైతులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ వారిని పరామర్శించేందుకు వెళ్లడం, రైతులు రోడ్లపైనే మామిడి పళ్లు పారేసి నిరసన తెలపడం, ఈ విషయంలో ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేయడం జరిగిపోయాయి. అయితే అప్పటికే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి మద్దతు ధర విషయంలో కేంద్రం జోక్యం కోరింది..ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన కేంద్రం.. తోతాపురి మామిడికి క్వింటాకు రూ.1490 మద్దతు ధర ప్రకటిస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, గుంటూరుకు చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాబీయింగ్ ఫలించడంతో కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించింది. అయితే 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం ఈ మద్ధతు ధరను రైతులకు చెల్లించనున్నాయి. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.