తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలపై ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో తాజాగా ఈ రోజు మరోసారి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. వేతన పెంపు విషయంలో నిర్మాతలు చేసిన మూడేళ్ల ప్రతిపాదనకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. వేతనాలను 30 శాతం పెంచాలన్న డిమాండ్ పై ఈ రోజు జరగనున్న చర్చలు ఫలవంతం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఒకవేళ చర్చల ఫలితం సానుకూలంగా లేకుంటే షూటింగ్ లు పూర్తిగా ఆపేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే ఒకట్రెండు రోజులు సమయం ఇస్తామని చెప్పారు. ‘నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదు. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఆయన సినిమా షూటింగ్ లకు మేము హాజరుకాబోము. నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీసులు పంపిస్తాము. ఛాంబర్ నిర్ణయం ప్రకారమే తుది కార్యాచరణ ఉంటుంది’’ అని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.