AP

పీ4 కార్యక్రమంపై స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 (ప్రజా-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమంపై వస్తున్న కొన్ని కథనాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు లేదా ప్రభుత్వ శాఖలకు ఎలాంటి కోటాలు విధించడం లేదని, ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు ఒక ప్రకటనలో తెలిపారు.

 

పీ4 కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన ఒక ప్రజా ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకే దీనిని ప్రారంభించినట్టు వివరించారు. “ఇది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు నడిచే కార్యక్రమం. దీనికి కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ద్వారా తక్షణ రాజకీయ ప్రయోజనాలు రావని తెలిసినప్పటికీ, ప్రజల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని కుటుంబరావు అన్నారు. పౌరులు, వ్యాపారవేత్తలు, ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, అధికారులు అందరూ కలిసి సమాజ సేవలో పాలుపంచుకునేందుకు పీ4 ఒక వేదికగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంపై ఏవైనా అపోహలున్నా లేదా అమలులో పొరపాట్లు జరిగినా వాటిని వెంటనే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.

 

రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దారిద్య్ర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమం లోతైన వ్యూహం, ప్రాముఖ్యత గురించి మీడియా మిత్రులకు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు అందిస్తామని, అందరి సహకారంతో ముందుకు సాగుతామని చెరుకూరి కుటుంబరావు తన ప్రకటనలో పేర్కొన్నారు.