తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందుకు వీలు కల్పించేలా తెలంగాణ పురపాలక చట్టం-2019కు సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, పురపాలక చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం లేదని, అందుకే చట్ట సవరణ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు కానుంది.
ఇదే సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. ఈ నివేదిక కాపీలను ఎమ్మెల్యేలందరికీ పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేశారు.
వీటితో పాటు ప్రభుత్వం మరో రెండు ముఖ్యమైన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లును కూడా సభ పరిశీలనకు పెట్టింది. ఈ బిల్లులపై సభలో చర్చ కొనసాగుతోంది.