ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తాము మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలోనే ముందుకు వెళుతున్నామని, దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వానివే ఉంటాయని, వైద్య విద్యార్థులకు గానీ, రోగులకు గానీ ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరు బెదిరించినా భయపడే పరిస్థితి లేదని, ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు నిర్మించకుండానే, అన్నీ పూర్తి చేశామని జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ప్రభుత్వ విధానాలపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూనే, తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు గుర్తుచేశారు. “ఒకప్పుడు రాయలసీమలో పదేళ్లలో ఎనిమిదేళ్లు కరవు ఉండేది. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాను మేం అభివృద్ధి చేసి చూపించాం. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం, హార్టికల్చర్‌ను ప్రోత్సహించడం వల్లే ఇవాళ ఆ జిల్లా జీఎస్‌డీపీలో గోదావరి జిల్లాలను మించిపోయింది” అని వివరించారు. కేవలం వృథాగా పోయే నీటిని మాత్రమే బనకచర్ల కాలువలకు వినియోగిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.