తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే, రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ వారీగా బయటపెట్టాలని ఆమె మంగళవారం డిమాండ్ చేశారు.
కులగణన సర్వే వివరాలను రహస్యంగా ఉంచి, బీసీ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా ఖరారు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలమైన ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఖరారు చేసుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆమె విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కవిత హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించేలోపే కులగణన వివరాలను బహిర్గతం చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె అన్నారు. “బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రిజర్వేషన్లు పెరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని కవిత తెలిపారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో బీఆర్ఎస్ అధినేత, ఆమె తండ్రి కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత, తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కాగా, ఆమె మంగళవారం మంచిర్యాల జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కూడా ఆమె పాల్గొన్నారు