AP

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా… సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

పర్యాటక రంగంతోనే రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యాటక ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. “ప్రస్తుతం నిలిచి ఉండే ఒకే ఒక్క ‘ఇజం’ టూరిజం మాత్రమే. ప్రపంచ దేశాలు పర్యాటకం ద్వారా 2.6 ట్రిలియన్ డాలర్ల ఆదాయం పొందుతున్నాయి. వాటితో పోలిస్తే అపారమైన అవకాశాలున్న మన దేశం, ముఖ్యంగా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం” అని అన్నారు. ప్రస్తుతం 8 శాతంగా ఉన్న పర్యాటక రంగ వృద్ధిని 20 శాతానికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో వేగంగా అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.10,600 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, రానున్న మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కొత్త హోటల్ గదులను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అలాగే, అరకు, పాడేరు, విశాఖ, తిరుపతి, రాయలసీమ వంటి పర్యాటక ప్రాంతాల్లో 10 వేల హోం స్టేలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

గత ప్రభుత్వంపై ఈ సందర్భంగా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. “రుషికొండపై రూ.450 కోట్లతో ప్యాలెస్ నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారు. అదే మొత్తాన్ని పర్యాటక రంగంపై ఖర్చు చేసి ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు లభించేవి. వారికి పాలనపై అవగాహన లేదు” అని ఆరోపించారు.

 

రాష్ట్రంలోని సాంస్కృతిక, చారిత్రక సంపదను పర్యాటకంగా మలుస్తామని చంద్రబాబు వివరించారు. అమెరికాలోని గ్రాండ్ కానియన్‌కు దీటుగా గండికోట, గుజరాత్‌లోని కచ్ తరహాలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుమల, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాల్లో ‘వెడ్డింగ్ డెస్టినేషన్స్’ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. మైసూరు, కోల్‌కతా నగరాల సరసన నిలిచేలా విజయవాడలో దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తామని, కూచిపూడి, థింసా వంటి కళారూపాలను, అరకు కాఫీ వంటి స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.