National

దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్… ప్రారంభించిన ప్రధాని మోదీ..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వదేశీ 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. శనివారం ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ‘భారత్ టెలికాం స్టాక్’ నెట్‌వర్క్‌ను జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా టెలికాం రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా దేశం ఒక కీలక మైలురాయిని అధిగమించింది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా, సుమారు రూ.37,000 కోట్ల వ్యయంతో, సౌరశక్తితో పనిచేసే 97,500 మొబైల్ 4జీ టవర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి గ్రామానికి 4జీ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘100 శాతం 4జీ సాచురేషన్ ప్రాజెక్టు’కు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశాలోని 2,472 గ్రామాలతో సహా దేశవ్యాప్తంగా సరిహద్దు, మారుమూల, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 26,700కు పైగా గ్రామాలకు తొలిసారిగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సుమారు 2.2 కోట్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూరనుంది.

 

భారత టెక్ దిగ్గజాల భాగస్వామ్యం

 

ఈ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ రూపకల్పనలో బీఎస్ఎన్‌ఎల్‌తో పాటు దేశీయ టెక్ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్), తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా టీసీఎస్ డేటా సెంటర్ల ఏర్పాటు, నెట్‌వర్క్ నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వర్తించగా, సీ-డాట్ కోర్ అప్లికేషన్‌ను, తేజస్ నెట్‌వర్క్స్ బేస్ స్టేషన్లు, రేడియో పరికరాలను అందించాయి. లక్షకు పైగా సైట్లలో ఈ స్వదేశీ పరికరాలను విజయవంతంగా నెలకొల్పారు. ఈ నెట్‌వర్క్ పూర్తిగా క్లౌడ్ ఆధారితమైనది కావడంతో, భవిష్యత్తులో సులభంగా 5జీకి అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు.

 

ఈ విజయంతో, సొంతంగా 4జీ, ఆపై టెక్నాలజీలను అభివృద్ధి చేసిన డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. టెలికాం పరికరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

గ్రామీణ భారత్‌కు డిజిటల్ వరం

 

ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ, “ఇది జాతి గర్వించదగ్గ చారిత్రాత్మక విజయం. టీసీఎస్, తేజస్ నెట్‌వర్క్స్, సీ-డాట్ భాగస్వామ్యంతో నిర్మించిన మా స్వదేశీ 4జీ నెట్‌వర్క్, ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి నిలువుటద్దం” అని అన్నారు. టీసీఎస్ సలహాదారు, తేజస్ నెట్‌వర్క్స్ ఛైర్మన్ ఎన్. గణపతి సుబ్రమణియం మాట్లాడుతూ, “సొంతంగా టెలికాం టెక్నాలజీని అభివృద్ధి చేసిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ను నిలబెట్టడం మాకు గర్వకారణం. బీఎస్ఎన్ఎల్‌లో ఈ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వ్యవస్థీకృతం చేయడం దేశంలోని ప్రతి మూలకు శక్తివంతమైన డేటా, వాయిస్ నెట్‌వర్క్‌ను తీసుకెళ్లడంలో చరిత్రాత్మకమైనది” అని వివరించారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్య, స్మార్ట్ వ్యవసాయ పద్ధతులు, 24 గంటల టెలిమెడిసిన్ వంటి సేవలు అందుబాటులోకి రావడానికి ఈ నెట్‌వర్క్ దోహదపడుతుంది. ప్రధాని మోదీ కలలు కన్న ‘డిజిటల్ ఇండియా’ లక్ష్య సాధనలో ఈ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.