ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని, ఇందుకుగాను రూ. 86,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనుందని ప్రధానికి వివరించారు.
ఈ చారిత్రాత్మక పెట్టుబడికి సంబంధించి మంగళవారం ఢిల్లీలోనే గూగుల్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానికి వివరించారు.
అమరావతి, పోలవరంపై ప్రత్యేక దృష్టి
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిని, సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి సుమారు రూ. 15-20 వేల కోట్ల నిధులు రానున్నాయని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని కోరారు. అదేవిధంగా, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను, గత ఐదేళ్లలో జరిగిన జాప్యాన్ని అధిగమించేందుకు అనుసరిస్తున్న వ్యూహాలను ప్రధానికి సమగ్రంగా నివేదించారు.
కీలక కార్యక్రమాలకు ప్రధానికి ఆహ్వానం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న జీఎస్టీ 2.0 రోడ్‌షోకు, అలాగే నవంబర్‌లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సును ప్రారంభించేందుకు రావాలని కోరారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లకు హబ్‌గా మార్చి, దేశంలోనే నంబర్ వన్ జీడీపీ సాధించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది.

