TELANGANA

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..!

2015 నాటి సంచలనాత్మక ఓటుకు నోటు కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ తో కూడిన ధర్మాసనం ఈ కీలక పిటిషన్లను పరిశీలించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి, తనపై దాఖలైన కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా కేవలం ఎన్నికల చట్టాల కింద మాత్రమే విచారణ జరపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆయన ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

 

ఈ కేసులో రేవంత్ రెడ్డిని ముందుగా ట్రాప్ చేసి ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారని రోహత్గి వాదించారు. ఈ ప్రక్రియలో సాధారణంగా పాటించే జనరల్ డైరీ నమోదు కూడా లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రోహత్గి తమ వాదనను ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టంలోని చట్ట సవరణలపై కేంద్రీకరించారు. ఈ సంఘటన జరిగిన 2015లో అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టం (1988)లోని సెక్షన్లు 7, 11 ప్రకారం లంచం తీసుకోవడమే నేరం అవుతుందని, కానీ లంచం ఇవ్వడానికి కుట్ర చేయడం లేదా లంచం ఇవ్వడం నేరం కాదని రోహత్గి వాదించారు. లంచం ఇవ్వడం కూడా నేరంగా పరిగణించేలా ఈ చట్టంలో సెక్షన్ 8 ను 2018లో సవరించారని అయితే తమ కేసు 2015 నాటిదని, కాబట్టి తమకు 2015 నాటి చట్టమే వర్తిస్తుందని ఆయన కోర్టుకు నివేదించారు.

 

ఈ కేసులో మరొక నిందితుడైన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం తనపై దాఖలైన కేసును పూర్తిగా రద్దు చేసి.. ఈ వ్యవహారంలో తన పేరును తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు న్యాయవాది కూడా తమ వాదనలను కోర్టు ముందు వినిపించాల్సి ఉంది.

 

ఇరువురు పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు పూర్తిగా వినాల్సిన అవసరం ఉందని భావించిన ధర్మాసనం, ఈ పిటిషన్లపై తదుపరి విచారణను మరుసటి రోజుకే వాయిదా వేసింది. మిగిలిన వాదనలను ముఖ్యంగా సండ్ర వెంకట వీరయ్య తరపు న్యాయవాది వాదనలను కూడా విన్న తరువాత సుప్రీం ధర్మాసనం తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.