AP

ఉప్పాడ బీచ్‌కు తుపాను తర్వాత ‘బంగారపు వర్షం’: ఇసుకలో మెరుస్తున్న కణాల కోసం స్థానికుల అన్వేషణ!

ఇటీవల అల్లకల్లోలం సృష్టించిన మొంథా తుపాను కారణంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్‌లో బంగారం దొరికిందనే వార్త వైరల్‌గా మారింది. ఇసుకలో మెరుస్తున్న కణాలను సేకరించడం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో స్థానికులు ఉప్పాడ బీచ్‌కు తరలివచ్చారు. అయితే, అవి నిజంగా బంగారు కణాలేనా అని ఇంకా ఎవరూ అధికారికంగా నిర్ధారించలేదు.

ఉప్పాడ ప్రాంత ప్రజలకు ఎప్పటినుంచో ఒక బలమైన నమ్మకం ఉంది: తుపాను లేదా భారీ అలలు వచ్చినప్పుడు, సముద్రం నుండి విలువైన వస్తువులు ఒడ్డుకు చేరుతాయి. వందల సంవత్సరాల క్రితం రాజుల నివాసాలు, ఆభరణాలు సముద్రపు అలల్లో మునిగిపోయాయని, అందుకే తుఫాను వచ్చిన ప్రతిసారీ బంగారం బయటకు వస్తుందని వారు నమ్ముతారు. ఈ నమ్మకంతోనే, మొంథా తుపాను తర్వాత కూడా గ్రామస్తులు బీచ్‌లో ఇసుక కోసం తీవ్రంగా వెతకడం ప్రారంభించారు.

స్థానిక గ్రామస్తులే కాక, దూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది బంగారం కోసం ఉప్పాడ బీచ్‌కు చేరుకున్నారు. కొందరు ఇప్పటికే తాము కనుగొన్న చిన్న, మెరిసే కణాలను చూపించారు. పెద్ద, చిన్న తేడా లేకుండా అందరూ ఇసుకలో అన్వేషణ చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది, ఉప్పాడ బీచ్‌లో దొరుకుతున్నవి నిజంగా బంగారమేనా అనేది అధికారులు నిర్ధారించాల్సి ఉంది.