ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి విచ్చేసిన కేంద్ర మంత్రితో సీఎం దాదాపు గంటపాటు రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ‘మొంథా’ తుపాను వల్ల వ్యవసాయ రంగంలో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వారిని ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఎం పలు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. పీఎం-ఆర్కేవీవై-పీడీఎంసీ (పర్ డ్రాప్ మోర్ క్రాప్) పథకం కింద 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రాష్ట్రానికి అదనంగా రూ. 695 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపూరి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన రూ. 100 కోట్లను తక్షణమే విడుదల చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను అభ్యర్థించారు. రాష్ట్ర రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

