AP

విశాఖలో అక్రమ గోమాంసం నిల్వలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు

విశాఖపట్నంలో భారీగా అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కఠినంగా స్పందించారు. ఈ దందాకు సంబంధించిన ముఠాల అసలు మూలాలను వెంటనే గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ అధికారులను స్పష్టం చేశారు. ఈ కేసులో ఎంతటి వ్యక్తులు ఉన్నా క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్వయంగా పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మొత్తం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

డీఆర్ఐ (DRI) అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజీపై దాడి నిర్వహించి దాదాపు 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసును పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఉపముఖ్యమంత్రికి తెలిపారు. మాంసం ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తరలించాలనుకున్నారు, అనుమతుల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. తప్పిదం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పవన్ కల్యాణ్‌కు హామీ ఇచ్చారు.

అక్రమ గోవధ, గోమాంసం సరఫరా లేదా ఎగుమతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన తర్వాత గతంలో పిఠాపురంలో ఉన్న అక్రమ వధశాలను మూసివేయించిన ఉదాహరణను ఆయన గుర్తుచేశారు. గోవధ నిషేధానికి ఎన్డీయే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తుందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి, ఈ అక్రమ దందాను పూర్తిగా అరికట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.